Janavaradhi | Online News


సత్తెనపల్లిలో నువ్వా..నేనా సై


మళ్ళీ దెబ్బ కొట్టాలని కోడెల
ప్రతీకారం తీర్చుకోవాలని అంబటి
ఇద్దరినీ ఓడించాలని యర్రం
పాత ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
సత్తెనపల్లిలో నువ్వా..నేనా సై 
 
సత్తెనపల్లి,జనవారధి:రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకున్నసత్తెనపల్లి నియోజకవర్గ బరిలో ముగ్గురు ఉద్దండులు కోడెల,అంబటి,యర్రంలు ముచ్చటగా మూడో సారి తలపడుతున్న సంగతి తెలిసిందే.పాత ప్రత్యర్ధుల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. ముగ్గురు అభ్యర్ధులు ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆయా పార్టీల శ్రేణులు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో గతంలో కంటే ఈ ఎన్నికల్లో ముగ్గురి  మధ్య రసవత్తర పోరు జరుగుతుంది.రాష్ట్ర స్ధాయిలో  తమకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న నేతలు బరిలో ఉండటంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
 
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో రాణిస్తున్న కోడెల పలు శాఖల మంత్రులుగా పనిచేసారు.నవ్యాంద్ర తొలి శాసన సభాపతిగా కొనసాగుతున్నారు. అలాగే అంబటి రాంబాబు కూడా వైఎస్ హయాంలో ఎపిపిఎస్సీ చైర్మన్ గా,  వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేతగా రాష్ట్ర‌ రాజకీయాల్లో తన పాత్ర పోషించారు.ఇక సౌమ్యుడిగా,అవినీతి లేని నాయకుడిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్ హయాంలో,కిరణ్ కుమర్ రెడ్డి హయాంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
 
 
మళ్ళీ దెబ్బ కొట్టాలని కోడెల (టిడిపి)
గత ఎన్నికల్లో  ప్రధాన అభ్యర్ధులు కోడెల,అంబటిల మధ్య పోరు చివరి నిముషం వరకు ఉత్కంఠంగా సా‍గింది.ఆఖరుకు కోడెల 960ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తెదేపా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గట్టెక్కిస్తుందన్న నమ్మకంతో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు.
 
ప్రతీకారం తీర్చుకోవాలని అంబటి (వైసిపి)
ఇక అంబటి విషయానికి వస్తే గత ఓటమి ఇప్పటికీ గుర్తు పెట్టుకుని పనిచేస్తున్నానని ఆయా సందర్భాలలో,సమావేశాల్లో పేర్కొనటం చూస్తే ఆయన ఈ ఎన్నికల్లో ఎంత కసిగా పనిచేస్తున్నారో అర్ధమవుతుంది.2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అంబటి భావిస్తున్నారు.తనకు ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్ధిస్తున్నారు. ఈ మేరకు సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆయన‌ ఆధారపడ్డారు.
 
ఇద్దరినీ ఓడించాలని యర్రం (జనసేన)
కేవలం రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన యర్రం ఓటమి పాలయ్యారని చెప్పవచ్చు.రెండు సార్లు వరసగా నియోజవర్గం నుండి గెలుపొందిన ఆయన ఈ సారి జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.కోడెల,అంబటిల కంటె తాను వ్యక్తిగతంగా మెరుగని,పదేళ్ళ పాలనలో నన్ను అందరు దగ్గరనుండే చుశారని,ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యర్రం పేర్కొంటున్నారు.ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీలకు దూరంగా ఉంటున్నానని,ఈ మార్పును ప్రజలు గమనించాలని చెప్తున్నారు.రాజకీయంగా తన కంటే ఓమెట్టు పైన ఉన్న ఆ రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులను ఓడిస్తానన్న ధీమాలో యర్రం ఉన్నారు.అంతేకాకుండా రూ.100ల స్టాంప్ పేపర్ పై తాను అధికారంలోకి వస్తే అవినీతి,అక్రమాలకు దూరంగా ఉంటానని న్యాయవాదుల సమక్షంలో వ్యక్తిగత ప్రమాణ పత్రాన్ని అందించటం చెప్పుకోదగ్గ అంశం.
 
 
ఈ విధంగా గెలుపుపై ఎవరి ధీమాలో వారున్న ఆయా పార్టీల నాయకులు... ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రచారానికి కేవలం మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో... సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.ఈనేపధ్యంలో ముగ్గురి మధ్య పోరు నువ్వా నేనా.. అన్నట్టు సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
 

POLL