Janavaradhi | Online News


‘మహర్షి’ ముసలి రైతు భావోద్వేగ ప్రసంగం..


సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నట్టు.. తెలుగులో నటులకు కరువా?.. ఎప్పుడూ పక్క ఇండస్ట్రీ నటుల వెనకే పడతారు? తెలుగు వాళ్లకు నటించడం చేతగాక కాదు.. వాళ్లతో నటింపచేయడం దర్శకులకు చేతగాక పక్క ఇండస్ట్రీ నటుల వెంట పడుతున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.. ఏ పాత్ర అయినా ఇరగదీస్తారని ఆయన అన్న మాటలు ‘మహర్షి’ చిత్రంలోని రైతు పాత్ర చూస్తే నూటికి నూరు శాతం నిజమే అనిపించకమానదు. ‘మహర్షి’ చిత్రంలో మహేష్ బాబు అల్లరి నరేష్, పూజా హెడ్గే, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరని, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పోసాని ఇలా చాలా మంది నటీనటులు నటించినా.. సెకండాఫ్‌లో వచ్చే ముసలి రైతు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మహేష్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. 
 
భుజంపై నాగలి, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో రైతు అంటే ఇలాగే ఉంటారా అన్నంతగా.. ఆ పాత్రలో పరకాయం ప్రవేశం చేసింది కర్నూల్ జిల్లాకి చెందిన గురుస్వామి స్టేజ్ ఆర్టిస్ట్. ‘ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. మరి రైతు ఏడిస్తే దేశానికి ఏం మంచి జరుగుతుందయ్యా.. ఇక్కడే పుట్టా, ఈ మట్టిలోనే చస్తా, ఎవడైనా ఈ పొలం నాదని వస్తే ఊరుకోను’ అంటూ ఈ ముసలి రైతు చెప్పే డైలాగ్స్ కళ్లు చెమర్చేలా చేశాయి. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా తొలిసారి స్టేజ్‌పై మాట్లాడిన గురుస్వామి కళ్లు చెమర్చే ప్రసంగం చేశారు. ఆయన స్పీచ్‌‌కి దర్శకుడు వంశీపైడిపల్లి స్టేజ్‌పైనే కళ్లనీళ్లు పెట్టుకోకా.. ఎమోషన్ అయిన మహేష్ బాబు.. గరుస్వామిని ఆలింగనం చేసుకున్నారు. గురుస్వామి మాట్లాడుతూ.. ‘తప్పటడుగులు వేస్తున్న పిల్లివాడిని ఎలా చేయిపట్టుకుని నడిపిస్తారో.. ‘మహర్షి’ సినిమాలో నన్ను అలా నడిపించారు. నేను ఊహించని ప్రపంచంలోకి వచ్చాను. 
 
ఈ జీవితం ధన్యం అయ్యింది. నా నట జీవితానికి గుర్తింపు వచ్చేట్టు చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్ర యూనిట్‌కి జీవితాంతం రుణ పడి ఉంటా. నాకు కెమెరా అంటే తెలియదు. సినిమాలు ఎలా చేస్తారో తెలియదు. ఎలా నిలబడాలో.. ఏం చేయాలో తెలియదు. రవి అనే ఆయన నా చేయిపట్టుకుని మీరు ఇలా నటించాలి.. ఇలా చూడాలి అని చెప్పారు. నేను ఓ కూలీ కొడుకుని. మా నాన్న కష్టపడి చదివిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగా. మాది చాలా పెద్ద కుటుంబం. ఆర్ధిక ఇబ్బందులను మరిచిపోవడానికి యాక్టింగ్ వైపుమళ్లాను. కర్నూల్‌లో స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నాను. లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నా. అలా నాతో ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో నన్ను చూసి దర్శకుడు వంశీపైడిపల్లి నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు. ఇదంతా దైవ సంకల్పం. 
 
మహేష్ బాబు గురించి పిల్లలు చెప్పుకునే వారు. ఆయన పెద్ద నటుడు అని. అలాంటిది ఆయనతో నేను నటించడం ఏంటి? ఆయన పక్కన నిలబడటానికే అర్హత లేదనేవారు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గురుస్వామి. గురుస్వామి మోస్ట్ ఎమోషనల్ స్పీచ్‌కి భావోద్వేగంతో లేచి వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. వెంటనే స్టేజ్ మీదే ఉన్న మహేష్ బాబు, నరేష్‌లు సైతం లేచి నిలబడ్డారు. అనంతంర మహేష్ బాబు చేతులెత్తి గురుస్వామికి నమస్కరించి గుండెలకు హత్తుకున్నారు. ఈ సక్సెస్ మీట్‌లో గురుస్వామితో పాటు.. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, దేవి శ్రీ ప్రసాద్, దిల్ రాజు, పోసాని తదితరులు పాల్గొన్నారు. 

POLL