Janavaradhi | Online News


మట్టితో అక్షర్ పటేల్ వికెట్ పడగొట్టిన ధోని


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. వికెట్ల వెనుక ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో..? అందరికీ సుపరిచితమే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా బౌలర్ల మార్పు, ఫీల్డింగ్ కూర్పులు చేసే ధోనీ తాజాగా మరోసారి తన మార్క్ కెప్టెన్సీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. చిటికెడు మట్టి తీసుకుని గాల్లోకి వదిలిన ధోనీ.. ఫీల్డర్ ఇమ్రాన్ తాహిర్‌ను ‘నీకు క్యాచ్ రాబోతుంది’ అంటూ హెచ్చరిక సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత బంతికే బ్రావో బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ డీప్ ఫైన్‌లెగ్‌లో ఉన్న తాహిర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీలో రిషబ్ పంత్ (38: 25 బంతుల్లో 2x4, 1x6), కొలిన్ మున్రో (27: 24 బంతుల్లో 4x4) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో డుప్లెసిస్, వాట్సన్ జోడీ.. తొలి వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యంతో చెన్నై విజయానికి బాటలు వేయగా.. వీరిద్దరి ఔట్ తర్వాత అంబటి రాయుడు (20 నాటౌట్: 20 బంతుల్లో 3x4), డ్వేన్ బ్రావో (4 నాటౌట్: 1 బంతి 1x4) గెలుపు లాంఛనాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే 151/4తో పూర్తి చేశారు. ఢిల్లీపై అలవోకగా గెలుపొందిన చెన్నై టీమ్ ఫైనల్‌కి చేరగా.. ఓటమితో ఢిల్లీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లూ మూడేసిసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. 





POLL