Janavaradhi | Online News


బీజేపీ మహిళా అభ్యర్థి కంటతడి...


సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ఈ నియోజకవర్గంలోని కేశ్ పూర్‌లో గల ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన ఆమెపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు దాడికి యత్నించారు. ఆమెను కిందికి తోసి వేశారు. దుర్భాష లాడుతూ..  అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు.ఆమె కారును ధ్వంసం చేశారు. దీంతో  ఘోష్ భద్రతా సిబ్బంది ఆమెకు  రక్షణగా నిలబడి అక్కడి నుంచి ఆమెను పంపివేశారు. అయితే మరో పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఆమెను టీఎంసీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. 
 
ఒక సందర్భంలో ఆమె కాన్వాయ్ పై కొంతమంది నాటు బాంబులు, ఇటుకలు విసిరారని, ఈ దాడిలో ఆమె భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారని తెలిసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు  ఘోష్  బాడీ గార్డు ఒకరు తుపాకీతో కాల్పులు జరపగా..బులెట్ తగిలి ఓ టీఎంసీ కార్యకర్త గాయపడ్డాడని సమాచారం. ఈ ఘటనలతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.  కాగా-దూసుకువస్తున్న ఆందోళనకారులనుంచి తప్పించుకునేందుకు ఆమె మొదట ఒక ఆలయానికి, ఆ తరువాత ఓ పోలీసు స్టేషన్ లోకి పారిపోయినట్టు కూడా తెలిసింది. అటు-భారతీ ఘోష్ తన మొబైల్ ఫోన్ తో కేశ్ పూర్ లోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి వీడియో తీయబోయారని వచ్చిన వార్తలపై స్పందించిన ఈసీ…,రిటర్నింగ్ అధికారులనుంచి నివేదిక కోరింది. గతంలో టీఎంసీలో కొనసాగిన ఘోష్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆమెకు పార్టీ నేతలు ఘటాల్ లోక్ సభ సీటును కేటాయించారు.





POLL