Janavaradhi | Online News


బాబు విషయంలో యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్ ?


ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడేమో అచ్చం కాంగ్రెస్ నేతలా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వీరవిధేయుడిలా బాబు మట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మోడీ ఏమైనా అంటే చంద్రబాబు నాయుడే ప్రధానంగా సహించలేకపోతూ ఉన్నారు. మోడీ విమర్శించింది తెలుగుదేశం పార్టీని కాదు. కాంగ్రెస్ ను. అయినా బాబు మోడీ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. 'దశాబ్దాల కిందటే చనిపోయిన రాజీవ్ గాందీని మోడీ ఎలా విమర్శిస్తారు..' అని బాబు ప్రశ్నించేయడం పెద్ద విడ్డూరం. ఎందుకంటే.. మొన్నటి వరకూ చంద్రబాబు నాయుడు 'ఇందిరాగాంధీ మీద పోరాడా.. రాజీవ్ గాందీ మీద పోరాడా..' అనే వారు.
 
ఇప్పుడేమో 'రాజీవ్ గాంధీని ఎలా విమర్శిస్తారు?' అంటూ మోడీని ప్రశ్నించేస్తూ ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మీద ప్రేమాప్యాయతలను చూపిస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్లేమో జగన్ మీద ప్రేమ వ్యక్తీకరణ చేసేస్తూ ఉన్నారు! ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జగన్ కు టచ్ లోకి వెళ్లిందని జగన్ దగ్గరకు తన దూతలను కూడా పంపిందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. జగన్ ఆ విషయంలో ఒకే మాట చెప్పారని.. 'ఫలితాలు వెల్లడి అయిన తర్వాత చూసుకుందాం..' అని జగన్ తేల్చి చెప్పినట్టుగా ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
 
అయినా జగన్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రేమ ప్రకటనను కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ పనికి దిగారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఈ పనిలోకి దిగిన వైనం కనిపిస్తోంది. 'జగన్ మా వాడే.. మా కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు..' అంటూ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. జగన్ ను పొగడటమే కాదు చంద్రబాబును విమర్శించడానికి కూడా చింతా మోహన్ వెనుకాడలేదు. బాబును అవకాశవాదిగా అభివర్ణించారాయన. మరి ఈ మాటలను వింటుంటే.. కాంగ్రెస్ వాళ్లు యూటర్న్ స్పెషలిస్టు చంద్రబాబు విషయంలో యూటర్న్ తీసుకున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. 





POLL