Janavaradhi | Online News


అన్న గెలుపు కోసం ప్రియాంక పూజలు....


హిందూత్వ ఎజెండా గెలుపు మంత్రమా? పార్టీల వరస చూస్తే అలాగే అనుకుంటున్నట్లుగా ఉంది.రాహుల్ శివ భక్తుడినంటూ గత ఎన్నికల ప్రచారంలో హిందూ సెంటిమెంట్ రంగరించి కాస్త మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు ప్రియాంక కూడా హిందూత్వ బాటలోనే పయనిస్తున్నారు. అన్న గెలుపు కోసం ఉజ్జయిన మహాకాళేశ్వరునికి శాస్త్రోక్తంగా పూజలు చేయడం కాంగ్రెస్ అభిమానులలో ఆనందం నింపుతోంది. ఆఖరు దశ ఎన్నికలు అన్ని పార్టీల్లోనూ చివరి పోరాటం గట్టిగా చేయాలన్న తపన పెంచుతున్నాయి. ఇప్పటి వరకూ పూర్తయిన ఎన్నికలు ఒక లెక్క ఇక మిగిలింది ఒకే దశ అదే ఏడవ దశ కనీసం ఈ దశలోనైనా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకోవాలన్న ఆలోచన అన్ని పార్టీలది. 
 
తన అన్న రాహుల్ ని ప్రధానిగా చూడాలనుకుంటున్న ప్రియాంక ఈ ఎన్నికల ప్రచారంలో చెమటోడ్చారు. ఎండల వేడిని సైతం తట్టుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక చివరి దశలో సానుకూల ఫలితాలు రావాలన్న ఆశతో ఆమె మధ్యప్రదేశ్ లోని ఉజ్జైనీలోని మహా కాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరీ ఇతర నేతలు వెంటరాగా ఆలయానికి చేరుకున్నారు. ఎర్రని చీరలో తలనిండా ముసుగు కప్పుకున్న ప్రియాంక నుదుటన కుంఖం పెట్టుకుని చేతులు జోడించి మహాకాళేశ్వరుని విగ్రహం ముందు కూర్చున్నారు. దాదాపు గంటసేపు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంక ఆ తర్వాత ఉజ్జైనీ లోక్ సభ సీటుకు పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి కోసం రోడ్ షో నిర్వహించారు. ప్రియాంక రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. ఉజ్జయిని బీజేపీ అభ్యర్ధిగా అనిల్ ఫిరోజియా నిలబడగా కాంగ్రెస్ అభ్యర్ధిగా బాబూలాల్ మాలవీయ రంగంలో ఉన్నారు. 
 
రోడ్ షోల అనంతరం ప్రియాంక బయలు దేరి రాట్లాం, అక్కడ నుంచి ఇండోర్ వెళ్లారు. తన ప్రచారానికి మంచి ఆదరణ కనిపిస్తుడటంతో ఆమె ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. తన సోదరుడు, తల్లికి విస్తృత ప్రచారం చేసిన ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం కష్టపడుతున్నారు. నానమ్మ ఇందిరను పోలిన రూపంతో ఉన్న ప్రియాంకను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇందిర కు ఉన్న మాస్ అప్పీల్, ఆకర్షణీయ రూపం ఆమెకు కూడా ఉండటంతో రాజకీయ నేతగా రాణించడానికి ఆమెకు ఈ పోలికలు కలిసొస్తాయంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎకానమీ, ఉపాధి, లాంటి అంశాలను ప్రస్తావించడమే కాదు సామాన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు ప్రియాంక.
 

POLL