Janavaradhi | Online News


చిన్నోడితో పెద్దోడిని హత్యచేయించిన తల్లిదండ్రులు...


ఇదో విచిత్రమైన కేసు. పెద్ద కొడుకుని తల్లిదండ్రులే చిన్న కొడుకుతో హత్యచేయించిన ఘటన. కన్న కొడుకునే చంపేయాలన్న కసి ఆ తల్లిదండ్రులకు ఎందుకొచ్చింది? చిన్నోడితోనే పెద్దోడిని ఎందుకు చంపించారు? దీని వెనుక ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తోన్న నరకం ఉంది. పెద్దోడు పెట్టే బాధలు, నరక యాతన ఉన్నాయి. తాగుడు, వ్యసనాలకు బానిసైన పెద్ద కొడుకు ప్రతిరోజూ తాగొచ్చి తల్లిదండ్రులను కొడుతుండేవాడు. డబ్బు కోసం హింసించేవాడు. కన్న కొడుకు కావడంతో ఆ తల్లిదండ్రులు అతని ఆగడాలను భరించారు. సహించారు. కానీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఏళ్ల తరబడి కొడుకు చేష్టలతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు తమకొద్దని నిర్ణయించుకున్నారు. చంపేయమని చిన్న కొడుకుతో చెప్పారు. 
 
తల్లిదండ్రుల ఆదేశాలను శిరసావహించిన చిన్న కొడుకు తన స్నేహితులతో కలిసి అన్నను చంపేశాడు. ఆ తరవాత ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో చనిపోయిన వ్యక్తి ఎముకలు, పుర్రె కనిపించడంతో కుటుంబ సభ్యులు చెప్పిన ఆధారాల ప్రకారం అదృశ్యమైన వ్యక్తి ఇతేనని నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. కేసును లోతుగా విచారించి అన్నను చంపింది తమ్ముడేనని తేల్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
జవహర్ నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం వంపుగూడలో ఉంటున్న మణెమ్మ, శ్రీనివాస్‌లు కాప్రా మున్సిపల్‌లో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు సాయికుమార్(25), కుమార్తె లావణ్య, చిన్న కుమారుడు సందీప్‌లతో కలిసి ఉంటున్నారు. సాయికుమార్ ఐదో తరగతి వరకు చదివి పెయింటర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసగా మారడంతో కూలీ డబ్బు దానికే ఖర్చు చేసేవాడు. అవి సరిపోకపోవడంతో అదనంగా డబ్బు కోసం రోజూ ఇంట్లో తల్లితో గొడవపడేవాడు. అడ్డొచ్చిన తమ్ముడిని, తండ్రిని కొట్టేవాడు. తల్లిపైనా చేయి చేసుకునేవాడు. దీంతో విసుగుపోయిన తల్లిదండ్రులు ఎలాగైనా సాయిని చంపేయాలని చిన్న కొడుకు సందీప్‌‌కు చెప్పారు. 
 
ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 25న రాత్రి 10 గంటలకు సాయి తల్లితో మరోసారి గొడవ పడ్డాడు. కోపంతో చేయి చేసుకున్నాడు. ఇది చూసిన సందీప్ అన్నపై కోపంతో బయటికి వెళ్లి తన మిత్రులైన ఫయాజ్‌, ఇబ్రహీం, గిద్యాల సందీప్‌లను తీసుకుని ఇంటికి వచ్చాడు. పెద్దకొడుకు సాయికుమార్ ఆగడాలు రోజురోజుకూ అధిక మవుతున్నాయని, ఎలాగైనా అంతమొందించాలని ఎంత డబ్బైనా ఇస్తానని మణెమ్మ, శ్రీనివాస్‌లు వారికి తెలిపారు. అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలో సందీప్‌ అతని ముగ్గురు మిత్రులు ఇంట్లో ఉన్న సాయిని ఊరు శివారున నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు. సాయితో గొడవవడ్డారు. వీరుబాటిల్‌ పగలగొట్టి దాంతో గొంతుకోశారు. గ్రానైట్‌ రాళ్లతో తలపై మోది అతి కిరాతకంగా చంపేశారు.
 
వారం రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడిన సాయి కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత మే 3న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 26న మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, ఇటీవల నిందితుల్లో ఒకరు వంపుగూడలోని ఉండే లోకల్ లీడర్ పత్తికుమార్‌కు తాము సాయి అనే యువకుడ్ని హత్యచేసినట్లు చెప్పాడు. అతని ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. 

POLL