Janavaradhi | Online News


చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ కిరికిరి...


చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై టీడీపీ ఆందోళన ఉధృతం చేసింది. ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఫిర్యాదుతో ఐదు పోలింగ్ బూతులతో పాటు మరో 8చోట్ల రీపోలింగ్ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రగిరిలో ధర్నా నిర్వహించిన టీడీపీ నేతలు కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలుఆందోళన చేపట్టారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైసీపీ ఫిర్యాదు చేస్తే ముందూ వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు. ఆందోళన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని టీడీపీ నేతలు సబ్‌కలెక్టర్‌కు అందజేశారు.
 
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారి పల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించాలని ఈసీ ఆదేశిచింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.





POLL