Janavaradhi | Online News


ఏపీలో కౌంటింగ్‌ కౌంట్‌డౌన్...


ఆంద్ర ప్రదేశ్లో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ సకల ఏర్పాటులో పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు మొదలయ్యే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ ఎన్నికల కమిషన్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 36 కేంద్రాల్లో లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్‌, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8 గంటలా 30 నిమిషాలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌ కోసం 25 వేల మంది సిబ్బంది పనిచేస్తారు. చాలా నియోజకవర్గాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సరాసరి 18 నుంచి 20 రౌండ్లలో ఒక్కో నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది.
 
అయితే ఈ సారి వీవీప్యాట్‌ స్లిప్పులు కూడా లెక్కపెట్టాల్సి ఉండటంతో.. ఈవీఎంల కౌంటింగ్‌ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్యాట్లు లెక్కిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 వందలా 50 వీవీప్యాట్లు లెక్కించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో వీవీప్యాట్‌ లెక్కింపు సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల లెక్కల్లో తేడా వస్తే.. రీ కౌంటింగ్‌ చేపడతారు. ఒకవేళ అప్పుడు కూడా తేడా వస్తే.. చివరకు రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం మేరకు.. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కే తుది ఫలితంగా విడుదల చేస్తారు.

POLL