Janavaradhi | Online News


చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం...


తమ కుమారుడి శస్త్ర చికిత్సకు సహకారం అందించాలని తల్లితండ్రులు చేసిన వినతికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆ చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా రూ.రెండున్నర లక్షలు మంజూరయ్యే విధంగా చొరవ చూపారు. జగిత్యాల జిల్లా రంగారావుపేటకు చెందిన మధు, సుమితరాణి దంపతులకు ఈనెల 8న మగబిడ్డ జన్మించాడు. శిశువు పెద్ద పేగు మూసుకుపోయి ఉందని ఆపరేషన్ ద్వారా రంధ్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యు చికిత్సకు ఐదు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
 
మధు దంపతులు సోషల్ మీడియాలో తమకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. స్పందించిన ది నెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ , హైదర్ నగర్ సభ్యులు , డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు, సురేందర్ ఫౌండేషన్ మెట్‌పల్లి ద్వారా లక్షా 50వేలు సేకరించారు. తక్కువైన మొత్తం కోసం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మిగిలిన మొత్తం రెండున్నర లక్షలు విడుదల చేయించి బాబు సర్జరీ విజయవంతం అయ్యేలా చేయూతనందించారు.