Janavaradhi | Online News


ఇకపై సర్వేలు చేయను...లగడపాటి క్షమాపణ‌


మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై సర్వేలు చేయనని తెలిపారు. ప్రజల నాడీని పట్టడంలో విఫలమైనందుకు చింతిస్తున్నట్లు వెల్లడించారు. తన సర్వేలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలని కోరారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం (మే 24) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డిసెంబర్‌ 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఏప్రిల్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేవ్ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నా. కారణాలేమైనప్పటికీ ప్రజానాడి పసిగట్టడంలో వరసగా రెండుసార్లు విఫలమైనందుకు గాను భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నా’ అని లగడపాటి వెల్లడించారు. 
 
2014లో తాను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకున్నానని రాజగోపాల్ గుర్తుచేశారు. నాటి నుంచి తాను ఏ రాజకీయ పార్టీలో చేరడంగానీ, అనుబంధంగా వ్యవహరించడంగానీ చేయలేదని వెల్లడించారు. ఎన్నికల సర్వేలు చేయడం తనకో వ్యాపకమని రాజగోపాల్ తెలిపారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ ప్రజానాడిని పసిగట్టే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఫలితాలు ఎవరికీ అనుకూలమైనా, వ్యతిరేకమైనా నిర్మొహమాటంగా వెల్లడించినట్లు తెలిపారు. సర్వేలు చివరికి తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న సందర్భాల్లోనూ ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు తెలిపినాని లగడపాటి వివరించారు.





POLL