Janavaradhi | Online News


కొడాలి నానిపై కేశినేని నాని షాకింగ్ కామెంట్స్...


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవర్తిస్తున్న తీరుతో పార్టీ అధినేత చంద్రబాబు, సొంత పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. అసలు ఆయన ఎందుకిలా ప్రవరిస్తున్నారో..? అర్థం కాని పరిస్థితి. అయితే నాని టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై ఎట్టకేలకు ఆయన స్పందించి చెక్ పెట్టేశారు. తన ఫేస్‌బుక్ వేదికగా రోజుకో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన ఎంపీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
 
విజయవాడ గుడివాడ నుంచి పోటీచేసిన కొడాలి నాని ఎవరూ ఊహించని మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ్నుంచి విజయవాడ రాజకీయాల్లో పేరుగాంచిన దేవినేని ఫ్యామిలీ నుంచి యువనేత అవినాష్‌ను టీడీపీ బరిలోకి దింపింది. అయితే విజయాలకు మారుపేరుగా ఉన్న కొడాలి నాని మాత్రం నాలుగోసారి కూడా విజయ డంఖా మోగించారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. కొడాలికి మంత్రి పదవి ఇచ్చి తన కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఇటీవలే మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొడాలి పౌరసరఫరాల శాఖను జగన్ కట్టబెట్టారు. ఈ సందర్భంగా పలువురు కొడాలి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
తాజాగా.. ఫేస్‌బుక్ వేదికగా మంత్రి కొడాలి నానిపై టీడీపీ కేశినేని సంచలన పోస్ట్ పెట్టారు. "కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!" అని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అర్థం పరమార్థం ఆ పెరుమాళ్లకు ఎరుక కానీ.. నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. కొంచెం హుందాగా వ్యవహరించండి సార్.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారెందుకు..? అని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు. అంతటితో ఆగని కేశినేని.. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఓ పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎవరైనా విమర్శించినా.. తనను విమర్శించినా మరుక్షణమే మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఎటాక్ చేసే కొడాలి.. కేశినేని పోస్ట్‌కు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.