Janavaradhi | Online News


మద్య నిషేదంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు...


ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఆద్వర్యంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ముందుగా ఖరారు చేసిన అజెండా మేరకు శాంతి భద్రతలపై తొలుత చర్చను చేపట్టారు. హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్‌, 13 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. చరిత్రలో తొలి సారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చినందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్, మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 1 నాటికి ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
 
ఈ విషయమై గతంలో తానిచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకునేది లేదని బల్లగుద్ది చెప్పారు. అలాగే జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులకు అనుమతులు ఇవ్వరాదని సీఎం జగన్ ఆదేశించారు. దాబాల్లో బ్రాందీ, విస్కీ తదితరాలను విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతమున్న మద్యం షాపుల లైసెన్స్ పరిమితి ముగియగానే, మరింత కఠినంగా ఉండేలా కొత్త పాలసీని తీసుకువస్తామని, ఈ దిశగా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని తెలిపారు.
 





POLL