Janavaradhi | Online News


సరికొత్త రికార్డులో రోహిత్ శర్మ...


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. బర్మింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 516 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్‌ను రోహిత్ శర్మ వెనక్కినెట్టాడు.
 
దీంతో పాటు ఒక వరల్డ్‌కప్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు పొందాడు. గతంలో భారత్‌ తరఫున ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(673) అగ్రస్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ఇక, ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. రోహిత్ క‌న్నా ముందు స‌చిన్ టెండూల్క‌ర్ ఆరు సెంచరీలతో ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు సాధించాడు.





POLL