Janavaradhi | Online News


మంచినీరు వదలండి మహాప్రభో


మంచినీరు వదలండి మహాప్రభో 
మురుగునీటిని తలపిస్తున్న త్రాగునీరు
అధికారులు పట్టించుకోరు, 
నాయకులు ఇటువైపు తిరిగిచూడరు
సమస్యలతో సతమతమౌతున్నమండల‌ ప్రజలు
 
ఫిరంగిపురం,జనవారధి:మండలంలోని ప్రజలు నీళ్లు త్రాగాలంటేనే హడలిపోతున్నారు.త్రాగేనీరు కేవలం ఎదో మురికివాసన వస్తేనే ఆ నీళ్లను మనం ముట్టుకోము. అలాంటిది మురికి నీళ్ళే త్రాగునీటి పైపుల్లో ప్రవహిస్తే..ఈ మురికి నీళ్లను ఎలా త్రాగుతారని ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. గత కొన్ని రోజులుగా మండలంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితే నెలకొంది.
 
అధికారులు ప్రజల సమస్యలపై అశ్రద్దగా ఉంటే కఠిన చర్యలు తప్పవని ఒకవైపు ముఖ్యమంత్రి సైతం ఆదేశాలు ఇస్తున్నా ఫిరంగిపురం గ్రామపంచాయితీ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావటం లేదు. అధికారులు పట్టించుకోరు,నాయకులు ఇటువైపు తిరిగిచూడరు. మరీ మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలంటూ స్ధానికులు మండిపడుతున్నారు.
 
మండలంలో సుమారు 16వేలకు పైగా జనాభా ఉన్నారు.ప్రతిరోజు నీరు అందిచాల్సి ఉన్నా నీటి కొరత కారణంగా  ఐదురోజులకి ఒకసారి మాత్రమే మంచినీటిని వదులుతున్నారు.ఆ నీరు త్రాగటానికి కాదుకదా... వాడుకోవడానికికూడా ఉపయోగపడనంత అద్వానంగా వున్నాయి. ప్రజలకి వేరేదారిలేక ఆ నీటినే వినియోగించాల్సిన దుస్ధితి నెలకొంది.వర్షాకాలం కావటంతో వ్యాధులు ప్రబలే అవకాశముంది.
 
ఇదే అదనుగా ఇక మినరల్‌ వాటర్‌ పేర్లతో పుట్టగొడుగుల్లా వెలసిన ప్లాంట్‌ల యాజమాన్యాలు చుక్కచుక్కకు లెక్కగట్టి జనం నుంచి ముక్కులు పిండి వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో బ్రాండెడ్‌ వాటర్‌ బాటిళ్ల దందా జోరుగా సాగుతోంది. విధిలేక ప్రజలు ఈ నీటిని కొనుక్కుని తాగుతున్నారు.ఏదిఏమైనా  అధికార యంత్రాంగం ఒక స్పష్టమైన ప్రణాళికతో స్వచ్ఛమైన నీటిని ప్రజలకందించాల్సిన‌ అవసరం ఎంతైనా ఉంది.ఇలాంటి సమస్యలు పునారావృతం చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.





POLL