Janavaradhi | Online News


త్వరలో బీజేపీలోకి రాయపాటి?


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ రెండు రోజుల క్రితం గోప్యంగా గుంటూరులోని రాయపాటి నివాసానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రామ్‌మాధవ్‌ వస్తున్న విషయం రాయపాటికి ముందుగానే తెలియడంతో ఆయనకు విందు కూడా ఇచ్చినట్లు తెలిసింది. రామ్‌మాధవ్‌ కలిసినా ఆ మరుసటి రోజే రాయపాటిసాంబశివరావు చంద్రబాబును కలుసుకుని తనకున్న ఇబ్బందులను వివరించినట్లు తెలిసింది. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు మరికొన్ని సమస్యలను విన్నవించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతానికి ఊగిసలాట ధోరణిలో ఉన్న రాయపాటి టీడీపీలో ఉంటారా లేక బీజేపీలో చేరతారా అనేది రెండు మూడు రోజుల్లో వెల్లడి కానుంది. 
 
మాజీ ఎంపీ రాయపాటి 2014కు పూర్వం కాంగ్రెస్‌లో కొనసాగి నాలుగు సార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి నరసరావుపేటనుంచి ఎంపీగా గెలుపొందారు. అంతక మునుపు కాంగ్రెస్‌ హయాంలో ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. రాయపాటి సాంబశివరావుకు జిల్లా వ్యాప్తంగా అనుచర గణం ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కానీ ఆ తరువాత టీడీపీలో చేరిన తరువాత కూడా జిల్లాలో తమ కేడర్‌ను రాయపాటి కాపాడుకుంటూ వస్తున్నారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు ప్రస్తుతం టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.





POLL