Janavaradhi | Online News


ఏటియం మోసగాడుని వలపన్ని పట్టుకున్న పోలీసులు


ఏటియం మోసగాడుని వలపన్ని పట్టుకున్న పోలీసులు
 
సత్తెనపల్లి,జనవారధి: చదువుకుని ఉన్నత స్ధానంలో స్ధిరపడాల్సిన ఓ యువకుడు అక్రమ మార్గంలో పయనించి జైలుపాలయ్యాడు.అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న ఏటియం కార్డులను మార్చి నగదు దొంగిలిస్తున్న యువకుడిని పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్న సంఘటన సత్తెనపల్లి పట్టణంలో జరిగింది.
 
స్ధానిక పట్టణ సిఐ విజయ చంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన నిడుమోల రామకృష్ణ,లక్కరాజు గ్రామానికి చెందిన పాలేటి సాగర్ లు ఎస్ బిఐ ఏటియంలలో కొద్ది రోజుల వ్యవధిలో వేరు వేరుగా నగదు డ్రా చేసుకునేందుకు వెళ్ళారు.కార్డ్ పనిచేయకపోవటం ఏటియం సేవలపై అవగాహన లేకపోవటం వంటి కారణాలతో వీరు ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న ముళ్ళమూడి వెంకటేశ్వరరావు అనే యువకుడు వారి వద్ద ఉన్న ఏటియం కార్డును ఏమార్చి,వేరే కార్డును వారికిచ్చి వారి పిన్ నంబర్ తెలుసుకుని ఆయా వ్యక్తులకు తెలియకుండా ఇతర ప్రాంతాలలో వారి ఖాతాల నుంచి నగదును డ్రా చేశారు.
 
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వరరావును సత్తెనపల్లి ఎస్ బిఐ మెయిన్ బ్రాంచ్ ఏటియం వద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నామని సిఐ వివరించారు.ఈ కేసులో నిందుతుడ్ని అదుపులోకి తీసుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ కె.రవికుమార్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కానిస్టేబుల్ రవి కుమార్ కు రివార్డును ఉన్నతాధికారుల నుండి ఇప్పించేందుకు నివేదికను పంపిస్తున్నామని ఆయన తెలిపారు.
 





POLL