Janavaradhi | Online News


‘ది లయన్ కింగ్’ మూవీ రివ్యూ.....


కొన్ని సినిమాలు వినోదాన్ని అందించడం మాత్రమే కాకుండా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటాయి.. అది ఊహ, కల్పితం అని తెలిసి కూడా ప్రేక్షకులు అద్భుతమైన ఆ ఊహా ప్రపంచంలో విహరించి వస్తుంటారు. తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ది లయన్ కింగ్’ ఈ కోవలోకే వస్తుంది. సుమారు పాతికేళ్ల క్రితం డిస్నీ సంస్థ తెరకెక్కించిన యానిమేషన్‌ చిత్రం ‘ది లయన్‌ కింగ్‌’ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో డిస్నీ సంస్థ తెరకెక్కించే హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు ఇప్పటికీ ఆదరణ ఉండటంతో డిస్నీ ఆ చిత్రాన్ని ఫొటో రియాలిస్టిక్ అనే సాంకేతికతను ఉపయోగించి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేసింది. మరి ఆ పాత చిత్రానికి కొత్త రంగులు ఎలా ఉన్నాయో సమీక్షలో తెలుసుకుందాం. 
 
అనగనగా ఒక అడవి.. ఆ అడవికి రాజు ముసాఫా అనే సింహం. ఆ అడవికి రాణి ముసాఫా భార్య సరభి (ఆడ సింహం). ఈ ఇద్దరికీ పుట్టిన యువరాజు సింబా (చిన్న సింహం). ముసాఫా పాలనలో అడవి జంతువులు అన్నీ సంతోషంగా జీవిస్తుంటాయి. అయితే అన్ని కథల మాదిరిగానే ఈ కథలోనూ విలన్ ఉంటాడు. అతడే దుష్ట సింహం స్కార్. ఇతడు స్వయానా ముసాఫాకి తమ్ముడు. అన్నను అంతం చేసి అడవికి రాజు కావాలని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అయితే రాజు తరువాత యువరాజు సింబాదే రాజ్యధికారం కావడంతో ముసాఫా, సింబాలను అంతం చేయడానికి కుట్ర పన్నుతాడు. ఓ దశలో సింబా దూకుడు కారణంగా తండ్రి ముసాఫా ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదంలో ముసాఫాను మట్టుబెట్టిన స్కార్.. అతని చావుకి సింబా కారణం అని నమ్మిస్తాడు. 
 
దీంతో తన తండ్రి చావుకు తానే పరోక్షంగా కారణమయ్యాననే బాధతో.. స్కార్ బలవంతంతో అడవి నుండి చిన్నప్పుడే పారిపోతాడు యువరాజు సింబా. ముసాఫా, అతడి కొడుకు సింబాల అడ్డు తొలగిపోవడంతో స్కార్ అడవికి రాజుగా మారి దుష్టపాలన సాగిస్తాడు. అతని పాలనతో అడవితో పాటు జంతువులన్నీ అంతరించిపోతుంటాయి. మరో అడవికి వెళ్లిన సింబాను పుంబా (అడవి పంది), టిమోన్ (ముంగిస)లు పెంచి పెద్ద చేస్తాయి. అన్నట్టు యువరాజు సింబాకి ఓ హీరోయిన్ ఉంటుంది. ఆమె పేరే నల (ఆడ సింహం). సింబా బతికి ఉన్నట్టు తెలుసుకున్న నల.. అడవిలో స్కార్ సాగిస్తోన్న వికృత పాలనను, సింబా తల్లి సరభిని.. అతడు పెట్టే చిత్ర హింసల్ని చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చేలా చేస్తుంది. చనిపోయాడు అనుకున్న సింబా అడవికి తిరిగొచ్చి తన చిన్నాన్న స్కార్ ఆట ఎలా కట్టించాడు? ముసాఫా చావుకు కారణమైన స్కార్‌ని ఎలా అంతమొందించాడు అన్నదే మిగతా కథ. 
 
హాలీవుడ్ అడ్వేంచర్ యానిమేషన్ మూవీకి తెలుగు డబ్బింగ్ అంటే బాబోయ్.. అనే ప్రేక్షకులు ఎక్కువమందే ఉంటారు. డబ్బింగ్ కారణంగా ఒరిజినల్ ఫ్లేవర్‌ని మిస్ చేస్తుంటారు. కాని ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. తెలుగు ప్రేక్షకులు 'ది లయన్ కింగ్' పాత్రలతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా టాలీవుడ్ స్టార్లతో డబ్బింగ్ చెప్పించడంతో ముఫాస‌.. స్కార్.. సింబా.. పుంబా.. టిమో.. పాత్రల్లో మనకు ఆయా జంతువులు కాకుండా డబ్బింగ్ చెప్పిన నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, రవిశంకర్.. వీళ్లే కనిపిస్తారు. 
 
తెలుగులో ముఫాసా పాత్రకు రవిశంకర్‌ వాయిస్ ఇవ్వగా.. సింబా పాత్రకు నాని.. స్కార్‌గా జగపతిబాబు.. నల పాత్రకు గాయని లిప్సిక.. పుంబా అనే అడవి పంది పాత్రకు బ్రహ్మానందం.. టిమోన్‌ అనే ముంగిస పాత్రలకు అలీ స్వరం అందించారు. సుమారు 260 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో జాన్‌ ఫెవ్‌రూ తెరకెక్కించిన ‘ది లయన్‌ కింగ్‌’ ఓ అద్భుత దృశ్యకావ్యం అనే చెప్పాలి. ఫొటో రియలిస్టిక్‌ అనే సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన అద్భుత సృష్టికి ముగ్ధుడుకాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అడవిలో ఉండే పెద్ద పెద్ద జంతువులతో పాటు.. చిన్న పురుగులు, గడ్డి వాము, ఏరు, వాగు, వంక ఇలా ప్రతి చిన్నదానికి అద్భుత దృశ్య రూపం ఇచ్చారు. అడవిలోని లొకేషన్లు రియాలిటీకి ఏమాత్రం తీసుపోకుండా ఉన్నాయి. త్రీడీలో చూస్తుంటే ఇదో అద్భుత ప్రపంచంలా అనిపిస్తుంది. 
 
అయితే ‘ది లయన్‌ కింగ్‌’ చూస్తున్నంతసేపు మనకు బాహుబలి చిత్ర కథే గుర్తొస్తుంది. రాజ్యాధికారం కోసం సోదరుడ్ని చంపాలని కుట్ర చేయడం.. అతన్ని రాజ్యం వదిలిపోయేట్టు చేయడం.. ప్రజల్ని హింసించడం.. తన అన్న భార్యను కావాలని కోరుకోవడం.. యువరాజుని అమరేంద్ర బాహుబలి అన్నట్టుగా పైకెత్తి రాజ్య ప్రజలకు చూపించడం.. యువరాజును వెతుక్కుంటూ యువరాణి (అవంతిక మాదిరి) వెళ్లడం.. కొడుకు వస్తాడని (దేవసేన) ఎదురుచూడటం.. ఇలా కథ పరంగా ప్రతి సన్నివేశంలోనూ బాహుబలి కథ వెంటాడుతోంది. ఇక కట్టప్ప శైలి పాత్ర కూడా ఇందులో ఉండటం విశేషం. 
 

POLL