Janavaradhi | Online News


రోడ్డు ప్రమాదంలో బాల నటుడి దుర్మరణం....


చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్స్ బాలనటుడు శివలేఖ్ సింగ్ (14) దుర్మరణం పాలయ్యాడు. అతడి తల్లి లేఖన, తండ్రి శివేంద్ర సింగ్‌తోపాటు నవీన్ సింగ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ధర్విసా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శివలేఖ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
తీవ్రంగా గాయపడిన లేఖన, శివేంద్ర సింగ్, నవీన్ సింగ్‌లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లేఖన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం తర్వాత ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. శివలేఖ్ ఓ మీడియా ఇంటర్వ్యూ కోసం రాయ్‌పూర్ వెళ్తున్నట్టు అతడి బంధువు ధీరేంద్ర కుమార్ శర్మ తెలిపారు. శివలేఖ్ సింగ్ స్వస్థలం చత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిరి-చంపా జిల్లా. పదేళ్లుగా వీరు ముంబైలో నివసిస్తున్నారు. శివలేఖ్ 'సంకట్‌మోచన్ హనుమాన్' 'ససురాల్ సిమర్ కా' సహా పలు హిందీ సీరియల్స్‌, రియాలిటీ షోల్లో నటించాడు.

POLL