కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షపై అనుసరించనున్న విధానంతో పాటు విద్యా విధానంలో మూడు భాషలను నేర్చుకోవాలని చెప్పడంపై హీరో సూర్య కొన్ని రోజుల క్రితం స్పందించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం సరైంది కాదంటూ ఆయన తెలియజేశారు. సూర్య వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీజేపీ నాయకులు సూర్యకు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శించేంత అర్హత ఎక్కడుంది? అంటూ విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి సూర్య సతీమణి సినిమా విడుదలను అడ్డుకున్నారు. దీనిపై సూర్య తనదైన శైలిలో భావోద్వేగంగా రియాక్ట్ అయ్యారు.
సూర్యకు కమల్ హాసన్ మద్దతుని తెలియజేశారు. కాగా.. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తన మద్దతుని తెలియజేశారు. సూర్య బందోబస్త్ సినిమా ఆడియో వేడుకకి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ``సూర్య అగరం ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి విద్యార్థులకు విద్యను అందించడంలో తోడ్పడుతున్నారు. అక్కడి విద్యార్థులు కొత్త విద్యావిధానం వల్ల పడే ఇబ్బందులను చూసే ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు మాట్లాడే అర్హత ఉంది. ఆయన మాటలను నేను సమర్ధిస్తున్నాను`` అంటూ తన మద్దతుని తెలియజేశారు రజనీకాంత్.