Janavaradhi | Online News


వైసీపీలో ఇసుక తుఫాన్.... రచ్చకెక్కిన వాటాల గొడవ?


ప్రభుత్వాలు మారిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీలకు కూడా స్థానాలు తారుమారు అయ్యాయి. కానీ ఇసుక తుఫాన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. మొన్నటిదాకా తెలుగుదేశం అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో కేంద్రీకృతమైన ఇసుక తుఫాన్ ఇప్పుడు దిశ మార్చుకుని వైసీపీ వైపు మళ్లింది. అయితే సీఎం జగన్ జోక్యంతో.. అది తాత్కాలికంగా తీరం వద్ద ఆగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సుడిగుండంలా తిరుగుతున్న ఇసుక తుఫాన్.. భవిష్యత్తులో దిశ ఎలా మార్చుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథనం తెలుసుకోవాల్సిందే..
 
    "రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు" అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దందాలో రాజకీయ నేతల జోక్యం, వారి మధ్య విభేదాల తీరు. ఒకవైపు అవినీతికి పాల్పడితే సహించేదిలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ నాయకులు మాత్రం.. తమ అధినేత మాటను పెడచెవిన పెట్టి మరీ ముందుకెళ్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరవర్గాల మధ్య ఏర్పడిన వివాదం రాష్ట్ర స్థాయిలో వార్తల్లోకి ఎక్కింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. వినియోగదారుడికి చౌకగా త్వరితగతిన ఇసుక అందే విధంగా ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటినుంచి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈలోపు ఇసుక కావాల్సిన వారు జిల్లా కలెక్టర్ లేదా మండలస్థాయిలో ఉన్న అధికారి ద్వారా అనుమతి పొంది, ఇసుకను తీసుకోవచ్చునని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్రంలో పరిమిత రీచ్‌లలో ఇసుక లభిస్తుండటంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
 
   తాడికొండ నియోజకవర్గంలో నదీ తీరానున్న తుళ్లూరు మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తుళ్లూరు మండలానికి చెందినవారు. ఆయన అనుచరులు కృష్ణాయపాలెంలో రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి స్పందిస్తూ.. అక్రమంగా ఇసుక తోలుకునేవారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమంగా రవాణా చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం ప్రారంభమైంది.
 
   వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రేగిన వివాదంపై పత్రికలు, ప్రసార మాద్యమాలలో వార్తలు రావడంతో.. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు వెళ్లింది. వీరిరువురికి తన పేషీ, పార్టీలోని కీలక వ్యక్తుల ద్వారా ఫోన్లు చేయించి వివాదం సరిదిద్దుకోవాలని ఆయన ఆదేశించారట. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో సదరు ఇద్దరు వైసీపీ నేతలతో పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేయించారట. తమ మధ్య ఎటువంటి వివాదం లేదనీ, ఇసుక అక్రమ రవాణాను ఆపేయాలనీ, సీఎం సూచించిన మేరకే తాను పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాననీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి చెప్పారు. శ్రీదేవి తమకు బంధువు అనీ, తనకు, ఆమెకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవనీ ఎంపీ నందిగం సురేష్ కూడా చెప్పుకొచ్చారు.
 
  మరోవైపు శ్రీదేవి, సురేష్‌ల అనుచరులు మాత్రం.. నియోజకవర్గంలో నువ్వా- నేనా అనే రీతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నందిగం సురేష్‌కు ప్లెక్సీలను ఏర్పాటు చేయటం, అందులో ఎమ్మెల్యే శ్రీదేవి ఫొటో లేకపోవడం వంటి అంశాలు కూడా వివాదానికి ఆజ్యం పోశాయట. వీరిరువురి మధ్య ఏర్పడిన వివాదానికి ముఖ్య కారణం ఇసుక దందానేనని తెలియటంతో దానిపై సీఎంవో వర్గాలు దృష్టి సారించినట్లు సమాచారం. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాయే ఆ పార్టీని ప్రజలలో పలుచన చేసిందనీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ అదే ఇసుక వ్యవహారంలోనే దెబ్బలాడుకుంటే పార్టీ పరువు పోతుందని సదరు నేతలు ఇద్దరికీ అధిష్టానం పెద్దలు హితోపదేశం చేశారట. అందుకే వారిద్దరు తమ మధ్య విభేదాల్లేవని మీడియా ముందుకొచ్చి చెప్పారని భోగట్టా.

POLL