Janavaradhi | Online News


విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ మధ్య విభేదాలు...


టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు పొడసూపాయా? ఇద్దరికీ అస్సలు పడడం లేదా? ప్రపంచకప్ తర్వాత ఇది మరింత ఎక్కువైందా? బల్లగుద్దిమరీ నిజమేనంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్ తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్‌ఫాల్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానం నెటిజన్లకు మరింత బలపడింది. ఇక తనను అన్‌ఫాలో చేయడంపై గుర్రుగా ఉన్న అనుష్క.. రోహిత్ శర్మ, అతడి భార్య రితికలను అన్‌ఫాలో చేసింది. ఈ పరిణామాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తున్న నెటిజన్లు కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని చెబుతున్నారు. 
 
ప్రపంచకప్‌లో ఇద్దరూ చాలా సఖ్యత ప్రదర్శించినప్పటికీ సెమీస్‌లో ఓటమి తర్వాత విభేదాలు మళ్లీ బయటపడ్డాయని అంటున్నారు. విండీస్ పర్యటన విషయంలో కోహ్లీ మనసు మార్చుకోవడానికి కూడా కారణం రోహిత్ శర్మేనని అంటున్నారు. నిజానికి ఈ పర్యటనకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ భావించాడు. అయితే, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుని వెళ్తున్నట్టు ప్రకటించాడు. ఈ పర్యటనకు తాను దూరంగా ఉంటే సారథ్యాన్ని రోహిత్‌కు ఎక్కడ అప్పగించేస్తారోనన్న భయమే కోహ్లీతో ఈ పనిచేయించిందని చెబుతున్నారు. అయితే, విభేదాల వార్తలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నా.. ఇటు కోహ్లీ కానీ, అటు రోహిత్ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
 





POLL