Janavaradhi | Online News


సొసైటీ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ పాటించారా..?తెదేపా


సొసైటీ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ పాటించారా..?తెదేపా 
3 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏమిటి..?
కోడెలను విమర్శించటం వైకాపా దిగజారుడుతనం
సత్తెనపల్లి తెలుగుదేశం నాయకుల విమర్శలు 
 
సత్తెనపల్లి,జనవారధి:అధికారంలోకి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి స‌మావేశాల్లోనే ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీలకు చట్టసభల్లో,నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ   నియోజకవర్గంలో ఇటీవల సొసైటీ చైర్మన్ల నియామకాల్లో ఎందుకు అమలు చేయలేదని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు.
 
బుధవారం స్ధానిక మాజీ సభాపతి కార్యాలయంలో  పట్టణ పార్టీ అధ్యక్షులు చౌట శ్రీనివాసరావు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,మైనార్టీ నాయకులు సయ్యద్ పెద కరీముల్లా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ల నియామకాల్లో బడుగులకు అవకాశం కల్పించలేదని,వైసిపి నేతల మాటలు కేవలం కాగితాలకే పరితమవుతున్నాయని విమర్శించారు.
 
గత మూడు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావులను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారన్నారు.విమర్శలు మని పాలనపై దృష్టి సారించాలన్నారు.కొత్త ప్రభుత్వం కొలువుతీరి మూడు నెలలు కావొస్తున్నా అభివృద్ధి పనులు ఒక్కటి ప్రారంభం కాలేదన్నారు.ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన మార్కెట్ కాంప్లెక్స్ గదులకు మాజీ చైర్మన్ యెల్లినేడి రామస్వామి పేరును ఖరారు చేస్తూ మున్సిపల్ తీర్మానం జరిగిందన్నారు.ఆ పేరును కాక వావిలాల గోపాలకృష్ణయ్య పేరును ప్రకటించటం సమంజసం కాదన్నారు.వావిలాల అంటే గౌరవమేనని,భవిష్యత్తులో వైసిపి చేపట్టబోయే నిర్మాణాలకు కూడా ఇలాంటి మహనీయుల పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
 
ఈ సమావేశంలో మస్తాన్ వలి,కంబాల వెంకటేశ్వరరావు,బత్తుల చంద్రశేఖర్,జింక లోకేశ్వరావు,నందం కబ్బయ్య,దేవాతి ప్రసాద్ లున్నారు.
 
 
 
 





POLL