Janavaradhi | Online News


సేవ్ నల్లమల అంటూ ప్రజ్వలన ఆధ్వర్యంలో ర్యాలీ


యురేనియం త్రవ్వకాలను నిలిపివేయాలి 
జీవకోటిని స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి 
సేవ్ నల్లమల అంటూ ప్రజ్వలన ఆధ్వర్యంలో  ర్యాలీ  
 
సత్తెనపల్లి: మానవ వినాశనానికి ఆస్కారమున్న ప్రమాదకరమైన యురేనియం త్రవ్వకాలను ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవుల్లో నిలిపివేయాలని ప్రజ్వలన సేవ సంస్ద ఆధ్వర్యంలో సిపిఐ,సీపీఎం,జనసేన,ప్రజా సంఘాల సహకారం,ఆర్జీఎన్ కళాశాల విద్యార్థుల సౌజన్యంతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది.సేవ్ నల్లమల-సేవ్ ఇండియా అంటూ వెయ్యి మంది విద్యార్థులు పుర విధుల్లో కదంతొక్కారు.అడవులను ధ్వంసం చేయవద్దంటూ  ముక్త కంఠంతో నినదించారు.ప్లకార్డులు చేతబూని ప్రజల్లో అవగాహన కల్పించారు.
 
శుక్రవారం బస్టాండ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ తాలూకా సెంటర్,గడియార స్ధంభం మీదుగా గాంధీబొమ్మలు సెంటర్ మీదుగా సాగింది.ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజ్వలన బాద్యులు చంద్ర మాట్లాడుతూ యురేనియం త్రవ్వకాల వల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు,ప్రజలకు లాభం కంటే నష్టమే అధికంగా జరిగే అవకాశముందన్నారు.అరుదైన జీవ జాతుల మనుగడ ప్రస్నార్ధముకంగా మారుతుందని,అటవీ సంపద ధ్వంసమవుతుందని,గాలి,నీరు,భూమి వాతావరణం కలుషితం కావటంతో మానవుల జీవనం ప్రాణసంకటంగా మారుతుందన్నారు.ఇది ప్రత్యక్షంగా జార్ఖండ్ రాష్ట్రంలో మనం చూస్తున్నామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ఇకనైనా విడనాడాలన్నారు.
 
సిపిఐ,సీపీఎం,జనసేన,రోటరీ క్లబ్ అధ్యక్షులు నరిశెట్టి వేణుగోపాల్,మామిడి వెంకటేశ్వరరావు,పెండ్యాల మహేష్,కొమ్మిశెట్టి సాంబశివరావు,తవిటి భావన్నారాయణ, గన్నమనేని శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రమాదకరమైన యురేనియంకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను విద్యుత్ ఉత్పత్తికి అన్వేషించాలని,యురేనియం త్రవ్వకాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేసారు.కార్యక్రమంలో ఆర్జీఎన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పరిటాల నరేష్,కాలేజీ ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
 

POLL