Janavaradhi | Online News


చైర్మన్‌ పదవికి గురిపెట్టిన ఆ..నలుగురు


సత్తెనపల్లి,జనవారధి:నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. నియోజకవర్గంలో రెండు వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా అందులో సత్తెనపల్లి ఓసి జనరల్, రాజుపాలెం బిసి మహిళకు కేటాయిస్తూ ప్రకటించారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా న్యాయమైన ధరకు కొనడం, రైతులు నష్టపోకుండా అండగా వారికి బాసటగా ఉండేదే మార్కెట్‌ కమిటీ. ఈసారి సత్తెనపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది. 
 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించిన  నేతలు నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.ఈ రెండు స్ధానాల్లో కమిటీ చైర్మన్‌ గిరికి  పలువురు ముఖ్య నాయకులు పోటీపడుతున్నారు.సత్తెనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో మండల పార్టీ అధ్యక్షుడు  రాయపాటి పురుషోత్తం,నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కళ్ళం విజయ భాస్కర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వీరితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు,రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డిలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
పదవులకోసం ఆశిస్తున్న నాయకులు మునిసిపల్‌,పంచాయితీ  ఎన్నికల్లోగా పదవులు దక్కితే పార్టీ  కోసం కష్టపడి పనిచేయాలనే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి  ప్రధానమైంది కావడంతో రెడ్డి సామాజిక వర్గానికే పదవిని కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.ఆశావహుల్లో ఎవరి అసలు నెరవేరతాయో..నియోజకవర్గ శాసనసభ్యుడు అంబటి రాంబాబు ఎవరి వైపు మొగ్గుతారో .. ఎవ‌రు ఈ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సొంతం చేసుకుంటారో మరి కొద్దీ రోజులు ఎదురు చూడాల్సిందే.
 





POLL