Janavaradhi | Online News


హలొ వాలంటీరేనా?


హలొ వాలంటీరేనా? 
ఆధార్ కార్డు జిరాక్సా ఆ రేపు రా..
సార్ వస్తున్నారు సమయానికి రండి 
వలంటీర్ల ఆవేదన ఇదీ.
 
సత్తెనపల్లి,జనవారధి:జగనన్న వలంటీర్ల ద్వారా ఇంటిఇంటికి బియ్యం ఇస్తామన్నారుగా..మీరు ఉల్లిపాయలు  ఎందుకు తెచ్చివ్వరు..? ఆధార్ కార్డు జిరాక్సా ఆ రేపు రా..అమ్మ లేదు మధ్యాహ్నం రా..వాళ్ళ డబ్బులు పడ్డాయంటగా మాకు పడలేదేంటి..?మిషన్లు ఇస్తున్నారంట మాకు చెప్పలేదేంటి..? స్ధులంగా ఇదీ వలంటీర్ల పరిస్ధితి.పేరుకు యాభై ఇళ్లకు సేవలే కానీ పని మాత్రం సమయ పాలన లేకుండా భారం పడుతుంది.ప్రభుత్వ సిబ్బంది లాగా నిర్దిష్ట సమయం లేకపోవటంతో లబ్ధిదారుల ఇళ్లకు,ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగటమే సరిపోతుంది. పట్టణంలో,మండలంలో ఏ రోజు ఏ అధికారి సమావేశం పెడతాడో ముందస్తు సమాచారం లేని పరిస్ధితి.ఒక రోజు మండల పరిషత్,ఇంకో రోజు రెవిన్యూ మరోసారి విద్యాశాఖ ఇలా అధికారుల సమావేశాలు,మీ సేవ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరైన గౌరవం లభించటం లేదని వలంటీర్ల ఆవేదన పడుతున్నారు.
 
5 వేల రూపాయల గౌరవ వేతనం,ఇంటి వద్దనే పని చేసుకోవటం,కేవలం యాభై కుటుంబాలకే సేవలందించటమే కదా అని ఉన్నత చదువులు చదివిన మహిళలు కూడా ఆసక్తిగా వలంటీర్ల ఉద్యోగాల్లో చేరారు.ప్రజా ప్రతినిధుల,అధికారుల పర్యటనల సందర్భంలో హడావుడిగా పిలిపించటం,ఇళ్ల వద్ద ప్రజలకు అవగాహన లేక సర్వేల కోసం సరైన సమాచారం అందించకపోవటం లాంటివి పని ఒత్తిడికి కారణమవుతుందని కొందరు వాలంటీర్లు పేర్కొంటున్నారు.విధుల్లో చేరిన తర్వాత స్పష్టమైన పని విధానం,సమయపాలన లేకపోవటంతో మున్సిపాలిటీల్లో ప్రత్యేకమైన సిబ్బంది చేయాల్సిన పని కూడా వలంటీర్ల పైనే రుద్దుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి జగనన్న వలంటీర్ల ద్వారా ఇంటిఇంటికి బియ్యం ఇస్తామన్నారుగా..మీరు ఉల్లిపాయలు  ఎందుకు తెచ్చివ్వరు అంటూ ఫోన్ చేసి వేధిస్తున్నారని కొందరు మమహిళా వాలంటీర్లు వాపోతున్నారు.నిత్యం స్మార్ట్ ఫోన్ తో పని ఎక్కువగా ఉంటటంతో అవగాహన లేక కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుమానంతో ఘర్షణలు పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ వలంటీర్ల వ్యవస్ధ మున్సిపాలిటీ,గ్రామాలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తీ స్ధాయి పని భారం తగ్గించిందనటంలో ఎలాంటి సందేహం లేదు.అయితే కొంతమంది ఉద్యోగులు చేయాల్సిన పని కూడా వలంటీర్ల ద్వారా చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
   





POLL