ఏపీలో వైసీపీదే అధికారం...రోజా!ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని, ఈసారి వైఎస్ జగన్ సీఎం కావడం పక్కా అని అన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ నేతలతో కలిసి బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ చెంపపెట్టులా మారనున్నాయని, వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై మహిళలకు నమ్మకం పోయిందన్నారు. 
 
నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి గెలవడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మరో 24 గంటల్లో ఆయన సర్వే తప్పని తేలిపోతుందన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక పాలనకు ఈ ఫలితాలు సాక్ష్యంగా నిలవనున్నాయని పేర్కొన్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన రోజాకు ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.