విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుంది... కేసీఆర్‌



విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో విద్యుత్‌ శాఖ పనితీరు బాగుందని ప్రశంసించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై సమీక్షించారు. విద్యుత్ శాఖపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే విధానం తమదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇకపై ప్రతీ నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా కఠినమైన విధానం అవలంభిస్తామని వెల్లడించారు. విద్యుత్ కు సంబంధమైన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి గ్రామాలు, పట్టణాల్లో త్వరలోనే 'పవర్ వీక్' నిర్వహించనున్నట్లు తెలిపారు.